నైవేద్యము అంటే ఏమిటి?


ఓం నమో బ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో, వంశ ఋషిభ్యో నమో గురుభ్య:
నైవేద్యము అంటే ఏమిటి?
నివేదింప తగిన, సమర్పింప తగిన వస్తువు, పదార్ధము. భగవంతునికి నివేదించే పదార్ధము. అది వస్తువే వుండ వలసిన అవసరము లేదు. మన మనస్సును కూడా నివేదించ వచ్చు.
మనము తినే ఆహారమును భగవంతునికి పెడితే, ఆ పెట్టె విధానమును నైవేద్యము అని అంటారు, ఆయన తినిన తరువాత ఆయన ఉచ్చిష్టము మనకు ప్రసాదము అవుతుంది. అదే మనము ముందు తిని ఆయనకు పెడితే ఎంగిలి అవుతుంది.అలా చేయ కూడదు . భగవంతునికి నివేదించిన పదార్ధము మనకు ప్రసాదము అవుతుంది. ఆ ప్రసాదము మనము భక్తితో తిన వలెను.
మనము తినే ఆహారమును శుచిగా, మడిగా వండి భగవంతునికి నివేదన చేయ వలెను. ఒక్కో దేవతకు ఒక్కో వస్తువు ప్రీతి. విశేష దినములలో ఆ రకముగా పిండి వంటలు చేసి భగవంతునికి ఆరాధన చేయ వలెను.
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహేశ్వరీ .....
అని నివేదన చేయ వలెను.
మరి ఈ నివేదన ఎలా చేయాలి?
వండిన పదార్ధములను అన్నీ ఒక పళ్ళెములో (అది మనము తినే పళ్ళెము వుండ కూడదు) లేదా ఒక విస్తరాకులో అన్నీ వడ్డించి తీసుకొని రావలయును. దాని మీద ఆవు నెయ్యిని అభికరించ వలెను. ఆవు నేతితో అది అమృతము అవుతుంది. గో సంబంధమైన పదార్దములు అమృతములు. అమృతమైన పదార్దములనే భగవంతునికి నివేదన చేయ వలెను. ఇతర పదార్ధములను పెట్టకూడదు.
యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి , మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను. దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను. గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి పంచ ప్రాణములకు, పంచ ఆహుతులు సమర్పించ వలెను స్వాహా కారముతో.
ముద్రలు తెలియని వారు గాయత్రీ మంత్రముతో సంప్రోక్షణ గావించి నివేదన చేయ వచ్చు.
నివేదన అయిన తరువాత ఆ పాత్రలు తీసి, ఆ తీసిన చోట మరలా నీళ్ళు చల్ల వలెను.
ఆ పైన తాంబూలాది సర్వోపచారములు చేసి భగవంతునికి నీరాజనము, మంత్ర పుష్పము చేయ వలెను.
తరువాత అపరాధాస్తవము చదువ వలెను.

Comments

Popular posts from this blog

నూతన యజ్ఞోపవీత ధారణ విధి & నిత్య త్రికాల సంధ్యా వందనము

Jambu dweepe bharata varshe Abstract

ఉపనయనము: